మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న తరువాత మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోనూ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఉదయం 9:30 లకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్గా కనిపించేందుకు ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.