రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు ఇతర కనీస అవసరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ ల సూచనలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. సహాయచర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రమాదపు అంచున ఉన్న వంతెనలపై ప్రయాణించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని.. కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం లేదా పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. వరి నాట్ల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు విష సర్పాల బారిన పడకుండా అప్రమత్తమయ్యేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పాము కాటుకు గురైన బాధితులకు తక్షణం మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పాము కాటు బాధితుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.