కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని, ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి రూ. 350 కోట్లు వెనక్కి తీసుకుందని ఇప్పటికే టీడీపీ పదే పదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాధాకృష్ణన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నట్లు కేంద్రం అంగీకరించింది. ఏడు జిల్లాలకు రూ.2,100 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించామని, రూ.1,050 కోట్లు మూడు విడతలుగా ఇచ్చామని కేంద్రం తెలిపింది. అయితే, తగిన అనుమతులు ఇవ్వని కారణంగా రూ.350 కోట్లను వెనక్కి తీసుకున్నామని పేర్కొంది.
ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సహకాలపై కేంద్రం మౌనం వహించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పన్ను ప్రోత్సాహకాలపై లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ప్రస్తావించారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం పన్ను ప్రోత్సాహకాల హామీ ఇచ్చిందని, ఇందుకోసం ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉందని రేణుక అన్నారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేయనందుకు ఏపీ ప్రజలు ఆందోళనగా ఉన్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పన్ను ప్రోత్సహకాల అవసరం ఉందని, సున్నితమైన ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మౌనం సరికాదని హితవు పలికారు.