అమీర్‌పేట్, హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం అమీర్‌పేట్ స్టేషన్‌లో జెండాఊపి ఈ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్‌పేట్‌లో రైలు మారాల్సి ఉంటుంది. బుధవారం నుంచి మెట్రో రైలు తిరగనున్న 10 కి.మీ. మార్గంలో అమీర్‌పేటతో పాటు మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ.. మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లు అందుబాటులోకి రావడం లేదు. వీటి ప్రారంభానికి మరికొద్ది వారాలు పడుతుందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్తమార్గంలో ఎక్కువ మలుపులు ఉండడంతో సీఎంఆర్‌ఎస్ వేగ నియంత్రణ విధించిందని చెప్పారు.