బిగ్ బీ అమితాబ్ నటించిన ఓ ప్రకటనపై బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓ బంగారు నగల కంపెనీకి సంబంధించిన ప్రకటనలో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కూతురు శ్వేత బచ్చన్ నందా కూడా నటించారు. ఆ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోగొట్టేలా ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ అంటోంది. యాడ్ కంపెనీపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేరళకు చెందిన బంగారు నగల సంస్థ కోసం తీసిన యాడ్‌లో అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు నటించారు. ఒకటిన్నర నిమిషాల వ్యవధిగల ఈ ప్రకటనపై బ్యాంకింగ్ యూనియన్లు భగ్గుమంటున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కలిగించేలా చేయడమే లక్ష్యంగా ప్రకటన ఉందని ఆరోపిస్తోంది. ఏఐబీవోసీ ఆరోపణలను బంగారు నగల సంస్థ కొట్టి పారేస్తుంది. అది కేవలం ప్రచార చిత్రం మాత్రమేనని అంటోంది. బ్యాంకర్స్ చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని దీనిపై ఏఐబీవోసీకి లేఖ రాయనున్నట్లు సంస్థ తెలిపింది.