చికాగోలో వెలుగుచూసిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మహిళా ఐక్యకార్యాచరణ సంఘం నాయకురాలు దేవి ప్రశ్నించారు. టాలీవుడ్‌లో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న క్యాస్టింగ్ కౌచ్, తాజాగా చికాగో సెక్స్ రాకెట్ విషయాలపై తెలుగు సినీపరిశ్రమను తాము ప్రశ్నిస్తున్నామని, మొత్తం 24 మహిళా సంఘాలు తరఫున తాము ఈ రెండు అంశాలపై మాట్లాడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాల కార్యాచరణ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో దేవీ మాట్లాడారు.
సినీ పరిశ్రమకు సంబంధించి మూడుసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, టాలీవుడ్, ఎఫ్డీసీ పెద్దలతో చర్చలు జరిపామని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా క్యాష్ కమిటీ వేస్తామని (మా) సినీ నటుల అసోసియేషన్ చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దేవీ మండిపడ్డారు. క్యాష్ కమిటీలో మహిళా, సామాజిక సంఘాల ప్రతినిధులను నియమించుతామని చెప్పారని, అది జరగలేదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం వెలుగుచూసిన తరువాత కో ఆర్డినేషన్ వ్యవస్థను తీసేస్తామని చెప్పారు, కానీ ఎక్కడా ఆ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులకు అవకాశాలు ఇప్పించేందుకు బ్రోకర్ వ్యవస్థ ఉండకూడదని తాము సినీ పెద్దలకు చెప్పామని తెలిపారు. ఆఖరికీ డ్యాన్సింగ్, యాక్టింగ్ స్కూళ్లలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారని, వీటి నివారణకు తగిన నియమ నిబంధనలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని దేవి డిమాండ్ చేశారు.
మహిళా హక్కుల కార్యకర్త సజయ మాట్లాడుతూ.. బాధితులకు కనీసం మాట్లాడటానికీ భయపడే పరిస్థితి నెలకొందని, కళమాతల్లికి సేవ అని చెత్త మాట్లాడుతూ.. మహిళలనే బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు ఎలా జరిగింది అని చెప్పే దమ్ము ఎవరికీ లేదని, కానీ, బాధితులను భయపెట్టి.. వారిని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, ఇది వ్యవస్థీకృత నేరమని ఆమె ధ్వజమెత్తారు. ఈ విషయమై ఇంతవరకు టాలీవుడ్ పట్టించుకోకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కేంద్రంగా జరుగుతున్న సెక్స్ రాకెట్‌లో సినీ పెద్దల ప్రోత్సాహం ఉందని మరో మహిళా సంఘం నేత సుజాత అన్నారు. ఈ పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాలని, నిజాలు వెలికితీయాలని ఆమె అన్నారు.