జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈరోజు కర్నూలు జిల్లా లోని హత్తిబెళగల్ క్వారీలో జరిగిన పేలుడు బాధితులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసినప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని అన్నారు. పవన్ రాక సందర్భంగా కర్నూలు నగరంలోని టోల్‌గేట్‌నుంచి హనుమాన్ సర్కిల్ వరకు అభిమానులు పెద్దయెత్తున ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం హత్తిబెళగల్‌కు వెళ్లిన ఆయన ప్రమాదానికి కారణమైన క్వారీని పరిశీలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో టీడీపీ నేతలను సమర్థించి ప్రజా సమస్యలను విస్మరించవద్దని కోరారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని అన్నారు. 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని స్థానిక యువత తన దృష్టికి తీసుకొచ్చినట్లు పవన్ తెలిపారు. ఈ సమస్యలపై త్వరలో కర్నూలు జిల్లా పర్యటనలో స్పందిస్తానని పవన్ పేర్కొన్నారు.